పంజాబ్ పోలీసుల కోవిడ్ కమాండో దళం


పంజాబ్ పోలీసులు సరికొత్తగా కరోనా కమాండో దళాన్ని నెలకొల్పారు. అన్నిరకాల కరోనా డ్యూటీల్లో తర్ఫీదు పొందిన ఈ యూనిట్‌కు కోవిడ్ కమాండోస్ అని పేరు పెట్టారు. కరోనా పాజిటివ్ కేసులను తొలిసారిగా చేరుకోవడం, క్వారంటైన్, ఐసోలేషన్, హాస్పిటలైజేషన్ విధులు నిర్వహించడం ఈ యూనిట్ బాధ్యతగా ఉంటుంది. మొహాలీ జిల్లాలో మొదటిసారిగా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. 19 మందితో కోవిడ్-19 కమాండో టీంను ఏర్పాటు చేశామని, జిల్లాలో కరోనా ఎమర్జన్సీ కేసులకు వీరు హాజరవుతారని మొహాలీ ఎస్సెస్పీ కుల్దీప్‌సింగ్ చాహాల్ తెలిపారు. శారీరకంగా ఫిట్ నెస్ కలిగిన ఆ 19 మంది కానిస్టేబుళ్లు ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కరోనా నియంత్రణ విధుల్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన వివరించారు. వారికి వ్యక్తిగత భద్రతా పరికరాల వినియోగంలో శిక్షణ ఇచ్చామని, జిల్లాలో ఎక్కడికైనా 30 నిమిషాల్లో వారు చేరుకోగలరని, వీరివల్ల మిగతా పోలీసు బలగం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ప్రథమ చికిత్సా సాధనాలతో కూడిన సంచులు కూడా వారి వెంట ఉంటాయని చెప్పారు.